వివాహం ఎందుకు ఘనమైనది..?
ప్రియమైన దేవుని పిల్లలకు.. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు. వివాహం విషయంలో సరియైన అవగాహన క్రైస్తవునికి బైబిల్ ని అనుసరించి కలిగి ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉంది. హెబ్రీయులకు 13:4 వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇంతటి ఘనతను వివాహం ఎందుకు పొందింది? దేవుని పిల్లలు భూమి మీదకి రావడానికి జరిగే పరిశుద్ధ కార్యక్రమమే వివాహము. ఇది దేవుని మొదటి కోరికగా బైబిల్ లో మనం చూడవచ్చు. ఆదికాండము 1:28 దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; మీరు ఫలించి, భూమిని నిండించమని తండ్రియైన దేవుడు మొదటి భార్యాభర్తలైన ఆదాము, హవ్వకు తన కోరికగా చెప్పడం జరిగింది. ప్రతీ పెళ్లి జరగడం వెనుక దేవుని చిత్తం ఆయన పిల్లలను పెళ్ళియైన వారి ద్వారా భూమి మీదకి తీసుకొని రావడమే. కీర్తనలు 127:3 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే. పెళ్లి చేసుకొనిన వారికి దేవుని తరపున వచ్చే అతిపెద్ద బహుమానం గర్భఫలము. మొదటిసారి గర్భాన్ని ధరించిన ప్రతీ ఒక్క అమ్మ పడే ఆనందాన్ని చూడండి. అది దేవుడు ఇచ్చిన బహుమానం అని కచ్చితంగా అర్థమవుతుంది. ...