1000 యేండ్ల పరిపాలన . . . !
ప్రియమైన దేవుని పిల్లలకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు.
ముఖ్యమైన పదాలు :
1000 యేండ్లు { సంవత్సరాలు }
క్రూర మృగము
క్రీస్తు రాజ్యము
మొదటి పునరుద్ధానము
తీర్పు
జీవగ్రంధము
ప్రకటన గ్రంథంలోని 20 వ అధ్యాయం లో వ్రాయబడిన 1000 యేండ్ల పరిపాలన గురించి ఆలోచిద్దాం. దాదాపు ఎక్కువ శాతం మంది క్రైస్తవులు ఈ 1000 యేండ్ల పరిపాలన అనేది క్రీస్తు రెండవ రాకడ జరిగిన తర్వాత జరుగుతుందని భావిస్తున్నారు . అయితే బైబిల్లోని వివరణ దీనికి వ్యతిరేకంగా ఉంది.
ప్రకటన గ్రంథం 20:6,7
ఈ మొదటి పునరుత్థాన ములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు. వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలోనుండి విడిపింపబడును.
క్రీస్తు రెండవ రాకడలో సాతానును తన నోటి ఊపిరి చేత అంతము చేస్తాడు.
2థెస్సలొనికయులకు 2:8
అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.
ఆగమన ప్రకాశము అనగా అయన రెండవ రాకడలో వచ్చే అద్భుతమైన వెలుగులో ఆ సాతాను నాశనము చేయబడతాడు . అయితే ప్రకటన 20:7 లో వెయ్యి సంవత్సరములు పరిపాలన జరిగిన తర్వాత అపవాది విడిపింపబడతాడు అని వ్రాయబడింది. దీనిని బట్టి ఈ వెయ్యేండ్ల పరిపాలన అనేది అపవాది బ్రతికి ఉన్నప్పుడే జరుగుతుంది అని మనం గమనించాలి.
మన ప్రభువైన యేసు రెండవ రాకడ ఆగమనంలోనే సాతాను నాశనం చేయబడతాడు కాబట్టి సాతాను బతుకు దినములు ఈ రెండవ రాకడకు ముందే అని అర్థమవుతుంది.
ఇప్పుడు ఇక యేసు రాజ్యము ఎప్పుడు ప్రారంభమైందో చుస్తే ఈ 1000 యేండ్ల రాజ్య పరిపాలన మనకు సులభంగా అర్థమవుతుంది. దీనికోసం ఒకసారి మనము దానియేలు గారి దగ్గరకు వెళదాం.
బబులోను సామ్రాజ్యపు అధినేత నెబుకద్నెజరు ఒక కల కన్నాడు. ఆ కలలో నాలుగు మహా సామ్రాజ్యాలు గతించి పోయిన తర్వాత నాలుగవ సామ్రాజ్యపు చివరిలో దేవుడు ఒక రాజ్యమును భూమి మీద స్థాపిస్తాడు. అది ఎప్పటికీ గతించిపోక యుగయుగములు నిలిచి ఉంటుంది అని దానియేలు గారి ద్వారా దేవుడు కల భావాన్ని తెలియజేసాడు.
ఈ నాలుగు సామ్రాజ్యాలు ప్రపంచ చరిత్రలో క్రీస్తుపూర్వం 4 మహా సామ్రాజ్యములు ఈ భూమిని పరిపాలించినవి
1. బబులోను మహాసామ్రాజ్యం
2. మాదీయ పారసీక మహాసామ్రాజ్యం
3. గ్రీకు మహాసామ్రాజ్యం
4. రోమా మహాసామ్రాజ్యం.
చివరిదైన రోమా సామ్రాజ్యపు చివరి కాలంలో యేసుక్రీస్తు పుట్టాడు. దేవుని మాట ప్రకారం యేసుక్రీస్తు పుట్టుకతోనే యేసు రాజ్యము స్థాపనకు పునాదులు పడ్డాయి.
అయితే ఇక్కడ వచ్చిన చిక్కు పరలోక ప్రార్ధనే. పరలోక ప్రార్ధనలో యేసే స్వయంగా నీ రాజ్యము వచ్చును గాక అని ప్రార్ధించండి అని చెప్పాడు. ఒకవేళ రాజ్యము వచ్చే ఉంటే, ఆలా ప్రార్ధించాలని ఎందుకు చెప్పినట్టు? మరి యేసు రాజ్యము ఎప్పుడు వచ్చినట్టు?
మార్కు 9:1
మరియు ఆయన ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవునిరాజ్యము బలముతో వచ్చుట చూచువరకు మరణము రుచిచూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను.
యేసు రాజ్యము బలముతో రావడం యేసుక్రీస్తు శిష్యులలో కొందరు చూస్తారు. అప్పటిదాకా వాళ్ళు చనిపోరు అని యేసు చెప్పారు. ఒకవేళ యేసు రాజ్యము ఇప్పటికీ రాకపోతే ఆ శిష్యులలో కొందరు ఇప్పటికీ బ్రతికే ఉండాలి. అది అసాధ్యం. యేసు శిష్యులు సువార్త పనిలో చంపబడ్డారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అంటే వాళ్ళు బ్రతికి ఉన్న కాలంలోనే యేసు రాజ్యము వచ్చింది అని మనము గ్రహించాలి.
ప్రకటన గ్రంధంలో 1000 ఏండ్ల పరిపాలన గూర్చి వ్రాసిన అపొస్తలుడైన యోహాను "యేసు మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగా చేసెను. మీ సహోదరుడను యేసునుబట్టి కలుగు శ్రమలోను రాజ్యములోనూ పాలివాడైన యోహానను నేను" అని ప్రకటన 1:6,9వ వచనములలో సాక్ష్యమిచ్చుచున్నాడు. ఇతని సాక్ష్యమును బట్టి దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచిన వారిలో ఇతడు కూడా ఉన్నాడని మనము గమనించవచ్చు.
అనగా యేసు రాజ్యము అప్పటికే వచ్చియిన్నది అని మనకు అర్థమవుతున్నది. ఈ రాజ్య పరిపాలనలో మనము కూడా ఉన్నాము. అనగా యేసుని ఎవరైతే రక్షకునిగా నమ్మి బాప్తిస్మము పొందుతారో వారు ఇప్పటికే రాజ్య సంబంధులుగా ఏర్పరచబడ్డారు. అంతేకాక ఇప్పటికీ ప్రతీరోజూ బాప్తిస్మము ద్వారా యేసు రాజ్యములో చేర్చబడుతూనే ఉన్నారు.
కొలస్సీయులకు 1:13
ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను.
రాజ్యనివాసులుగా చేయబడ్డాము. రాజ్యములోనే ఉన్నాము.
1పేతురు 2:9
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.
రాజులైన యాజక సమూహముగా చేయబడియున్నాము.
ఇప్పుడు ఒకసారి ప్రకటన గ్రంధంలోని 1000యేండ్ల పరిపాలన మరొకసారి చదువుదాం.
ప్రకటన గ్రంథం 20:7,8
వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలోనుండి విడిపింపబడును.
వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు.
పరిపాలనలో 1000 సంవత్సరములు గడిచిన తరువాత అని వ్రాయబడియుంది. అనగా పరిపాలన అనేది అంతము అయ్యేది కాదు. దానిలో కొంత సమయం గడిచిన తరువాత అనే అర్థము వస్తుంది. ఇదే అర్థాన్ని దానియేలు గ్రంధములో మనము చదివాము. 1000 అనే మాట దీర్ఘ కాలాన్ని సూచిస్తుందే తప్పా, నిజమైన సంఖ్య కాదు. ప్రకటనలో వ్రాయబడిన సంఖ్యలు దాని అర్థాన్ని తెలియజేసేవే తప్పా, వాస్తవమైన సంఖ్యలు గా వ్రాయబడలేదు అని గ్రహించాలి.
ఇప్పుడు ముగింపుకు వద్దాం. యేసు పుట్టిన తర్వాత ఆయన రాజుగా భూమి మీద పరిపాలన మొదలు పెట్టాడు. అది మొదట్లో ప్రారంభం అవ్వలేదు కానీ యేసు బోధ జరుగుతున్న సమయంలో మారుమనస్సు పొందిన వారు రాజ్యముగా చేయబడడం ప్రారంభం అయ్యాక ఆయన రాజ్యము స్థిరపరచబడింది. అది ఇప్పటికీ 2000 సంవత్సరాలనుండి కొనసాగుతుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుందో చెప్పలేము. ఎందుకనగా ఆ ముగింపు దినము గూర్చి తండ్రి తప్ప వెరెవరికీ తెలియదు.
మత్తయి 24:36
అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలై నను కుమారుడైనను ఎరుగరు.
అందువలన ఈ పరిపాలనా కాలాన్ని 1000 సంవత్సరాలుగా సూచించడమైనది. 1000 అనగా సుదీర్ఘ కాలం అని అర్థమే తప్పా ఖచ్చితంగా 1000 సంవత్సరాలు అని కాదు. ఈ పరిపాలన భూమి మీద అంతము అయ్యి పరలోకానికి మార్చబడుతుంది. ఎందుకనగా యేసు రెండవ రాకడలో భూమి మరియు సమస్త ప్రకృతి అంతమవబోతున్నాయి.
అదే సమయంలో సాతాను కూడా అంతమవుతుంది.
1కోరింథీయులకు 15:25,26
ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము.
మీకు ఏదైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు.
మరొక అంశంతో ప్రభువు చిత్తమైతే మీ ముందుకు వస్తాను.
ఆమెన్.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి