దశమ భాగాల చరిత్ర..!

దశమ భాగాల చరిత్ర..!

ప్రియమైన దేవుని పిల్లలకి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు.

 నేడు ప్రతీ సంఘములో దశమ భాగాల సేకరణ అమలులో ఉంది. దశమ భాగాలు తప్పు అని, తీసుకునే వాళ్ళు ఏదో దొంగలు అని నేను చెప్పబోవడం లేదు. దయచేసి పోస్ట్ పూర్తిగా చదవవలసిందిగా నా మనవి. ప్రతీ నెల వచ్చే జీతములో లేదా ఆదాయంలో 10వ భాగాన్ని దేవుని కొరకు సమర్పించడాన్ని దశమ భాగం సమర్పణ అంటారు. దశమ భాగం గురించి మొదటగా బైబిల్లో ఎక్కడ చెప్పబడింది ?

 లేవీయకాండము 27:30 
భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. 

లేవీయకాండము 27:32 గోవులలోనేగాని గొఱ్ఱె మేకలలోనేగాని, కోలక్రింద నడుచునన్నిటిలో దశమభాగము ప్రతిష్ఠితమగును. 

లేవీయకాండము 27:34 
ఇవి యెహోవా సీనాయికొండ మీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. 

 కొండమీద మోషే గారికి ఇచ్చిన ఆజ్ఞలలో దశమ భాగాలు ఇవ్వడం కూడా ఒకటి. దేవునికి ప్రతిష్టితముగా ఈ దశమ భాగాలను ఇవ్వాలి. 

ద్వితీయోప 12 : 6, 7 
అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమభాగములను, ప్రతిష్టితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణ ములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొఱ్ఱ మేకలలోను తొలిచూలు వాటిని తీసికొని రావలెను. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మునాశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములును మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనముచేసి మీచేతిపనులన్నిటియందు సంతోషింపవలెను. 

 దేవుని ఆరాధించే స్థలానికి ఈ దశమ భాగాలు తీసుకొని రావాలి. అక్కడ దేవునికి అర్పించి, మిగిలిన వాటిని విందుగా సిద్దపరచి తిని, దేవుణ్ణి మహిమ పరచాలి.



 ఇది మొదట దశమ భాగాలు సేకరించడంలో అంతర్యం. తరువాత ఈ దశమ భాగాలను ఉపయోంచడంలో చిన్న మార్పు ఏర్పడింది. 

సంఖ్యాకాండము 18:21 
ఇదిగో లేవీయులు చేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క సేవకు నేను ఇశ్రాయేలీయులయొక్క దశమభాగములన్నిటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. 
 
ఇశ్రాయేలీయుల 12 గోత్రాలలో లేవీ గోత్రము వారు దేవుని సేవను ఎంచుకుని, దానినే వారి ప్రధానమైన పనిగా స్వీకరించారు. అందువలన వారికి జీవనోపాధి లేకుండా పోయింది. వారి పూర్తి సమయం దేవుని సేవకే కేటాయించారు. మిగతా 11 గోత్రాల వాళ్ళు వారి వారి స్వంత పనులను చూసుకోవడంలో నిమగ్నులయ్యారు. లేవీయులు మిగతా 11 గోత్రాల వారు అర్పించే బలులను దేవునికి ప్రతిష్టించడం, ధర్మశాస్తమును బోధించడం, ఇలా దేవునికి మిగతా 11 గోత్రాల వారికీ మద్య ప్రధాన సేవకులుగా నిలిచారు. కాబట్టి మిగిలిన 11 మంది గోత్రాల వాళ్ళు సమర్పించే అన్ని రకాల బలులలో ఒకటైన దశమ భాగాన్ని లేవీయులకు జీవనాధారంగా దేవుడు నియమించాడు. ఈ దశమ భాగాలని లేవీయులు వారి అవసరాలకు వాడుకోవచ్చు. 



 హెబ్రీయులకు 7:5
 మరియు లేవి కుమాళ్లలోనుండి యాజ కత్వము పొందువారు, తమ సహోదరులు అబ్రాహాము గర్భవాసమునుండి పుట్టినను, ధర్మశాస్త్రము చొప్పున వారియొద్ద, అనగా ప్రజలయొద్ద పదియవవంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొందియున్నారు.

 అయితే క్రొత్త నిభందన వచ్చాక మోషే ధర్మ శాస్త్రము కొట్టివేయబడింది. అనగా ఈ దశమ భాగాల ఆజ్ఞ కుడా రద్దు చేయబడింది. మోషే ధర్మ శాస్త్రములో పేద, మద్య ,ధనిక తేడాలు లేకుండా ప్రతీ ఒక్కరు దశమ భాగాన్ని కచ్చితంగా ఇచ్చి తీరాలి. అది ఆజ్ఞగా ఇవ్వబడింది. ఇప్పుడు అలా ఆజ్ఞగా కాకుండా ప్రేమ పూర్వక భాద్యతగా ఏర్పడింది. సువార్త పనిలో తమ జీవితాలను పూర్తిగా నిమగ్నం చేసి జీవనోపాధిని కుడా విడిచిపెట్టిన నేటి తరం భోదకులలో కొంత మంది నిజాయితీ పరులకు విస్వాసులుగా మన వంతు సహాయం మనం చెయ్యాలి. అది దశమ భాగమా, లేదా ఇంకా ఎక్కువ లేదా చాలా తక్కువ అనేది లెక్కలోనికి రాదు. మీ మనసుకు వచ్చినంత మీ వంతు సహాయం చేయండి. అంతే కాకుండా కేవలం బోధకులకే సహాయం చేయడం కాదుగానీ, తోటి సహోదరులలో పేదవాళ్ళకు సహాయం చేసే బాధ్యత కుడా మన మీదనే ఉంది. ఒకరిని ఒకరం ఆదుకొని చేయూత అందించాలి. 

 రోమీయులకు 15:25 
అయితే ఇప్పుడు పరిశుద్ధులకొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్లుచున్నాను.ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయవారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి. 

 ఆనాడు యెరూషలేములో పేదలకు మాసిదోనియ, అకయ సంఘం వారు ప్రత్యేకంగా చందా పోగు చేసి పంపించడం చుడండి. ఎంత ప్రేమ కనిపిస్తుంది దీనిలో...! 

 2కోరింథీయులకు 8:2 
ఏలాగనగా, వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా, అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను, మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతట తామే యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. 

 కొంతమంది దొంగలైన బోధకుల వలన ఈ దశమ భాగాల సమర్పణలో కొన్ని అవకతవకలు వచ్చినప్పటికీ నిజమైన సేవకున్ని ఆదుకోవడానికి చాలా ఉపయోగపడే సంప్రదాయం ఈ దశమభాగాల సమర్పణ. అయితే మనం ఇచ్చే కానుకకు ఆ సదరు బోధకుడు అర్హుడా, కాదా అనేది మనం ఆలోచించుకొని ఇవ్వాలి. ప్రజల సొమ్ముకి అలవాటు పడి పందికొక్కులలాగా తయారైన దొంగ బోధకులకు మీ కష్టార్జితాన్ని చేరనివ్వకండి. పేదలైన బోధకులను ఆదుకోండి. 

 1కోరింథీయులకు 16:1,2,3 
 పరిశుద్ధులకొరకైన చందా విషయమైతే నేనుగలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని యెంచి పత్రికలిత్తురో, వారిచేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. 

 ఎవరు యోగ్యుడో వారికి మాత్రమే చందాలు ఇవ్వండి. ఇది మొదటి సంఘం ఆచరించింది. మనము కూడా ఆచరించాలి. 

 మరి కొంతమందిలో ఉన్న అపోహ ఏమిటి అంటే, ఎన్ని పాపాలు చేసినా నెల మొదటికి దశమ భాగాన్ని ఇస్తే దేవుడు క్షమిస్తాడు అని భ్రమలో బతుకుతున్నారు. అది 100 కి 100 శాతం తప్పు. 

 లూకా 11:42 
అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను పదియవవంతు చెల్లించు చున్నారే గాని, న్యాయమును దేవుని ప్రేమను విడిచి పెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి యున్నది. 

 నీతిగా, నిజాయితీగా బ్రతకడంతో పాటుగా ఇది కుడా చెయ్యాలి. అలా కాకుండా తప్పులు చేసుకుంటూ పోతూ దశమ భాగాలూ ఇవ్వడం వలన వచ్చిన ఉపయోగమేమీ లేదు. ఆలోచించండి. 

 లూకా 18 : 12 - 14 
వారమునకు రెండు మారులు ఉప వాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచుదేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. 

 దశమ భాగము ఇచ్చినా కుడా ప్రవర్తన మంచిగాలేని వారు దేవునికి ఇష్టులు కాలేరు అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. మీ సందేహాలను, అభిప్రాయాలను దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మన దేవుని ప్రేమ మనతో ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. 

 మరొక అంశంతో ప్రభువు చిత్తమైతే మీ ముందుకు వస్తాను . 

 ఆమెన్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆది కాండము

సమూయేలు మొదటి గ్రంధం