యెహోషువ గ్రంధము
యెహోషువ గ్రంధము
పుస్తకం సంఖ్య - 6
విభాగం - పాత నిభందన
వర్గము - చరిత్ర
రచయిత - యెహోషువ
రచించిన కాలం - క్రీ.పూ. 1400 - 1375
రచించిన ప్రదేశం - కనాను
వ్రాయబడిన భాష - ఆదిమ హీబ్రూ భాష
అధ్యాయాల మొత్తం - 24
యుగం - ధర్మ శాస్త్ర కాలము.
యెహోషువ గారు తన వృద్దాప్యంలో వ్రాసిన పుస్తకం ఇది.
ఆదికాండములో దేవుడు అబ్రాహాము గారికి ఇచ్చిన వాగ్దానం ఈ పుస్తకంలో నెరవేరింది. ఇశ్రాయేలీయులు తమ వాగ్ధాన భూమికి చేరుకోవడం ఈ పుస్తకంలో వ్రాయబడింది.
మోషే గారి తర్వాత యెహోషువ గారు ఇశ్రాయేలీయులను కనాను దేశానికి నడిపించే పని చేపట్టి, వారిని కేవలం కనానుకు నడిపించడం మాత్రమే కాకుండా, కనానులో గోత్రాల వారికి ఆ భూమిని పంచిపెట్టే కార్యక్రమం కూడా చేపట్టారు.
ఒక్క లేవీయ గోత్రానికి తప్ప మిగతా 11 గోత్రాలకు వాగ్దాన భూమి పంచిపెట్టబడింది. లేవీయులకు మాత్రం భూమి ఇవ్వబడలేదు.
వారు యాజక వృత్తి చేపట్టినందువలన మిగిలిన అన్ని గోత్రాల వారు లేవీ గోత్రం వారికి తమ తమ పంటలలో ఆదాయంలో పశువులలో దశమ భాగాన్ని సమర్పించాలి. అయితే లేవీ గోత్రపు పెద్దలు యెహోషువ గారి వద్దకు వచ్చి మోషే గారి ద్వారా దేవుడు మాకు మా పశువులకు కొంత భూభాగాన్ని కేటాయించమని చెప్పాడు అని మనవి చేశారు. అందుకు జవాబుగా యెహోషువ గారు అన్ని గోత్రాల నుండి కొంత భూమిని కొన్ని ఇండ్లను లేవీయులకు ఇచ్చారు. ప్రతి గోత్రము నుండి లేవీయులకు కొంత భూమి లభించింది. అంతే తప్ప వారికి విడిగా ఎటువంటి భూమి లేదు. వారు కేవలం నివసించడానికి మాత్రమే భూమి ఇవ్వబడింది తప్ప, పంటలకు భూమి ఇవ్వబడలేదు. అందువలన వారికి మిగిలిన 11 గోత్రాల వారు దశమ భాగాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది.
కాలేబు 85 సంవత్సరాల వయసువాడైనా, హెబ్రోనునుండి ప్రజలను తరిమివేసే కష్టమైన పనిని తనకు అప్పగించమని కోరాడు. ఆ పట్టణంలో భారీకాయులైన అనాకీయులు ఉండేవారు. యెహోవా సహాయంతో ఈ అనుభవంగల యుద్ధశూరుడు ఆ పని చేయగలిగాడు, హెబ్రోను ఆశ్రయపురముగా మార్చబడింది.
రోమీయులకు 15:4
ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.
దేవుని మాట ఎప్పటికీ తప్పిపోదు. దీనికి నిలువెత్తు ఉదాహరణే యెహోషువ పుస్తకము. దేవుని మీద మన విశ్వాసం ఇంకా బలపడడానికి ఈ పుస్తకం ఎంతో తోడ్పడుతుంది.
యెహోషువ ప్రార్థన చేయగా దేవుడు సూర్యుణ్ణి, చంద్రుణ్ణి ఆకాశంలో అలానే నిలబెట్టాడు. దాదాపు ఒకరోజంత సమయం సూర్యుడు, చంద్రుడు అలాగే నిలిచిపోయాయి. ఈ సంఘటన యెహోషువ పుస్తకంలో వివరించబడింది.
యెరికో గోడలు కూల్చడం కూడా ఈ పుస్తకంలో వ్రాయబడింది ( యెహోషువ 6:1-25 )
ప్రభువు చిత్తమైతే మరొక పుస్తకం గురించి తర్వాతి భాగంలో మాట్లాడుకుందాం.
ఆమెన్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి